Hyderabad: రూ.3.37 కోట్లు మోసపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. మహిళ పేరుతో ఆయనను ఎలా నమ్మించారంటే?
అర్జున్ మెహతా అనే మహిళ పేరుతో మోసగాళ్లు కిశోర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించారు.

online investment scam
హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాజా రత్న కిశోర్ ఆన్‌లైన్ పెట్టుబడి వలలో చిక్కుకుని రూ.3.37 కోట్లు మోసపోయారు. ప్రముఖ ట్రేడింగ్ సంస్థ పేరుతో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా ఆయనను కేటుగాళ్లు మోసం చేశారు.
మోసాన్ని గ్రహించిన కిశోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 మే మొదటివారంలో అర్జున్ మెహతా అనే మహిళ పేరుతో మోసగాళ్లు కిశోర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించారు. మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పారు.
ఆ తర్వాత అర్జున్ రమేశ్ మెహతా అనే వ్యక్తి ట్రేడింగ్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా కిశోర్‌కు పరిచయమయ్యాడు. 90 శాతం కచ్చితత్వంతో పనిచేసే ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగిస్తున్నామని, ప్రత్యేక ఐపీఓ లిస్టింగ్స్‌లో 120 నుంచి 160 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపాడు.
Also Read: అయ్యో పంత్.. అలా ఎందుకు చేశావ్..! చర్యలకు సిద్ధమైన ఐసీసీ..
వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా నిత్యం మార్కెట్ అప్‌డేట్స్, ఫేక్ లాగిన్ పోర్టల్స్ పంపుతూ కిశోర్‌లో మోసగాళ్లు నమ్మకాన్ని పెంచారు. కిశోర్‌ను మానసికంగా ప్రభావితం చేశారు. కిశోర్ పెట్టుబడులకు వచ్చిన లాభాలు రూ.25.91 కోట్లు అని చెప్పి, వాటిని రిలీజ్ చేయాలంటే 10 శాతం ప్లాట్‌ఫాం ఫీజు చెల్లించాలని నమ్మించారు. మార్చి 30 నుంచి మే 15 వరకు కిశోర్ మొత్తం రూ.3.37 కోట్లను 33 ట్రాన్సాక్షన్ల ద్వారా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఖాతాల్లోకి పంపించారు. చివరకు, కిశోర్‌కు లాభాలేం రాలేదు, డబ్బు విత్‌డ్రా కూడా కాలేదు.
మోసపోయానని గ్రహించిన కిశోర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ టీజీసీఎస్బీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆన్‌లైన్‌లో ఎక్కువ లాభాల పేరుతో వచ్చే పెట్టుబడి స్కీముల విషయంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని అధికారులు సూచించారు. సెబీ రిజిస్ట్రేషన్ వివరాలు అధికారిక పోర్టల్‌లో చెక్ చేసి, పూర్తిగా పరిశీలించిన తర్వాతే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెబుతున్నారు.